పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి
నాగులవంచలో సీపీఎం ఆధ్వర్యంలో 41వ వర్ధంతి
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం: మునుకుంట్ల సుబ్బారావు
కాకతీయ, చింతకాని : కమ్యూనిస్టు ఉద్యమ మహోన్నత నేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నాగులవంచ సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామినేని అప్పారావు పాల్గొని నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు మునుకుంట్ల సుబ్బారావు మాట్లాడుతూ.. సేవ, త్యాగం, నిబద్ధత, నిజాయితీలకు సుందరయ్య జీవితమే నిలువుటద్దమని కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, సమాజంలోని అసమానతలను చూసి చిన్న వయసులోనే కులసూచిక ‘రెడ్డి’ని తొలగించుకున్నారని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో రైతులను నడిపించారన్నారు. ప్రజాసేవకు ఆటంకం కలగకూడదని భార్య లీలమ్మతో కలిసి ఆయన చేసిన త్యాగాలు అజరామరమని, కోట్లాది రూపాయల ఆస్తిని పేదలకు పంచిపెట్టారని స్మరించుకున్నారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన మహోన్నత వ్యక్తిత్వంగల సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నివాళి కార్యక్రమంలో సీపీఎం మధిర డివిజన్ కమిటీ సభ్యులు ఆలస్యం రవి, మండల కమిటీ సభ్యులు తోటకూర వెంకట నరసయ్య, గ్రామ శాఖ కార్యదర్శులు కందరబోయిన కొండలరావు, రౌతు అప్పారావు పాల్గొన్నారు. అలాగే పార్టీ శాఖ సభ్యులు బైరు రామయ్య, అంబటి మధు, గుమ్మడి నవీన్, ఆవుల సతీష్, కంభం శ్రీనివాసరావు, ఆలస్యం కృష్ణమూర్తి, గంధం నాగార్జున, షేక్ హుస్సేన్, ఎస్.కె. ఉద్దండు, ఎస్కే మహమ్మద్ మరియు పార్టీ సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

