సదాశివపల్లిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
పరీక్షల్లో క్యాన్సర్ లక్షణాలతో ఇద్దరి గుర్తింపు
శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ
కాకతీయ, కరీంనగర్ : అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హౌసింగ్ బోర్డ్ పరిధిలోని సదాశివపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకటరమణ, పీవో డీటిటీ డాక్టర్ ఉమాశ్రీ శుక్రవారం పరిశీలించారు. శిబిరంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేయడం సులువవుతుందని, ఇందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇద్దరికి క్యాన్సర్ లక్షణాలు
ఈ శిబిరంలో నిర్వహించిన పరీక్షల్లో క్యాన్సర్ లక్షణాలతో ఇద్దరు, బీపీ లక్షణాలతో 27 మంది, షుగర్ లక్షణాలతో 14 మందిని గుర్తించి, వారికి అవసరమైన వైద్య సూచనలు అందించారు. అలాగే 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్న బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో పీవో ఎన్‌సీడీ డాక్టర్ విప్లవ శ్రీ, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రాజ్‌కుమార్, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ పోచయ్య, జీవన్‌రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

