నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్తు!
శిక్షణ సంస్థల కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : ఆధునిక కాలంలో కేవలం చదువు మాత్రమే సరిపోదని, నైపుణ్యాభివృద్ధితోనే యువతకు ఎన్నో అద్భుత అవకాశాలు లభిస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల ఇరవై మూడు వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సాంకేతిక శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించి, ఏయే కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు, అర్హతలేంటి అనే అంశాలపై అధికారులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి ఆరున ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పరిశ్రమల శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల ద్వారా అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలు, రాయితీలను (సబ్సిడీలను) ఉపయోగించుకుని యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నర్సింగ్ పూర్తి చేసి, విదేశీ భాషలపై పట్టు ఉన్న వారికి టామ్‌కామ్ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, సిరిసిల్ల జిల్లా నుంచి ఇప్పటివరకు నలభై ఐదుగురు నర్సింగ్ అభ్యర్థులు విదేశాల్లో కొలువులు సాధించారని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హనుమంతు, జిల్లా యువజన క్రీడల అధికారి రాందాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

