కరెంట్ వైర్లు తీసేదెప్పుడు..? ఇల్లు పూర్తయ్యేదెప్పుడు..?!
ఇంటి పైనే 11 కేవీ హైటెన్షన్ లైన్… నిలిచిపోయిన స్లాబు పనులు
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆవేదన
రూ.2 లక్షల బిల్లులో రూ.60 వేల కోతపై నిరీక్షణ
కాకతీయ, కారేపల్లి : ప్రభుత్వం జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తుండగా, మొదటి విడత లబ్ధిదారులు మాత్రం క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, బిల్లుల గందరగోళంతో నలిగిపోతున్నారు. కారేపల్లి మండల పరిధిలోని గాదేపాడు గ్రామపంచాయతీలో వెలుగుచూసిన ఓ ఘటన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇబ్బందులకు అద్దం పడుతోంది. గాదేపాడుకు చెందిన భూక్య గోవర్ధన్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరవడంతో ఉత్సాహంగా నిర్మాణ పనులు ప్రారంభించాడు. అయితే, అతని ఇంటి పైనుంచే ప్రమాదకరమైన 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్లు వెళ్తుండటంతో స్లాబు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో కార్మికులు పనులకు రావడం లేదు. “కరెంట్ వైర్లు తీసేదెప్పుడు? మా ఇల్లు పూర్తయ్యేదెప్పుడు?” అంటూ బాధితుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
బిల్లుల్లో భారీ కోత
మరోవైపు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. స్లాబు దశకు రావాల్సిన రూ.2 లక్షల బిల్లులో ప్రభుత్వం కేవలం రూ.1.40 లక్షలే విడుదల చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. మిగిలిన రూ.60 వేలు పీఎంఏవై, ఈజీఎస్ నిధుల కింద వస్తాయని అధికారులు చెబుతున్నా, ఆ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయో స్పష్టత లేదు. ఇప్పటికే ఇండ్లు పూర్తి చేసుకున్న పలువురికి కూడా ఈ నిధులు అందలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, గోవర్ధన్ ఇంటి పైనున్న విద్యుత్ వైర్లను తక్షణమే తొలగించాలని, నిలిచిపోయిన రూ.60 వేల బకాయి బిల్లులను వెంటనే విడుదల చేసి పేదలను ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

