3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
తెలంగాణ వృద్ధి రేటు అద్భుతం
రాష్ట్ర వృద్ధి రేటు 10.7 శాతం.. దేశ సగటు కంటే వేగంగా ప్రగతి
పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు
విద్యార్థుల రుణాలు భవిష్యత్ పెట్టుబడులు
వడ్డీ లేని రుణాలు రూ.1,000,000 కు పెంపు
వ్యవసాయ రుణాల లక్ష్యం సాకారం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ
కాకతీయ,తెలంగాణ బ్యూరో : సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతలను ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన 49 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిశోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ మోహన్, ఎస్‌బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగడం అద్వితీయమని కొనియాడారు.

వ్యవసాయ రుణాల లక్ష్యం సాకారం
వ్యవసాయ రుణాల విషయంలో లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రూ.1,65,297 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,68,401 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు మరియు అనుబంధ రంగాలకు కిసాన్ క్రెడిట్ కార్డు సహా వివిధ పథకాల ద్వారా బ్యాంకులు అందిస్తున్న మద్దతు అభినందనీయమన్నారు. తెలంగాణ పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళా, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని, విద్యార్థులకు ఇచ్చే రుణాలు యువతపై మనం పెట్టే భవిష్యత్ పెట్టుబడి అని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడెడ్లుగా పరుగులు తీయగలవని ప్రజా ప్రభుత్వం చేతల్లో నిరూపించిందన్నారు.
వడ్డీ లేని రుణాలు భారీగా పెంపు
మహిళా ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు రూ.500,000 నుంచి రూ.1,000,000 కు పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో మహిళా సంఘాలకు రుణ పంపిణీపై యుద్ధప్రాతిపదికన దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ నగరం మహిళలకు వ్యాపార రంగంలో, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల్లో ఎదగడానికి ఎన్నో అవకాశాలను ఇస్తోందని, నగరంలోని మురికివాడల్లోని యువ మహిళా పారిశ్రామికవేత్తలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. నేడు ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి సారిస్తోందని, ప్రజా ప్రభుత్వం కూడా సౌరశక్తి విభాగంలో స్థిరమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు మరియు ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని సూచించారు.
తెలంగాణ వృద్ధి రేటు అద్భుతం
ప్రస్తుతం దేశ సగటు వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంటే, తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతంతో దూసుకుపోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందని, ఈ నేపథ్యంలో సేవల రంగానికి అధిక అవకాశాలు ఉంటాయని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం అత్యంత వేగంగా పూర్తి చేయడం కూడా ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలతో అనేక ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకువస్తున్నామని, దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

