మణుగూరులో నాణ్యత లేని మటన్
చనిపోయిన మేకల మాంసం యథేచ్ఛగా విక్రయం
మేకల కాపరులతో వ్యాపారుల అంతర్గత ఒప్పందాలు
రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రభుత్వ హాస్టళ్లకు కల్తీ మాంసం సరఫరా
తనిఖీలు చేయకుండా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
కొద్ది రోజుల క్రితం కుళ్లిన మటన్ తిన్న విద్యార్థులకు అస్వస్థత
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నాణ్యత లేని మటన్ విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. ఫంక్షన్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న మటన్ వ్యాపారులు రోగాల బారిన పడ్డ మేకలను వధించి ఆ మాంసాన్ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో మటన్ ధర రూ.800 పలుకుతోంది. అయితే ఫంక్షన్స్, రెస్టారెంట్స్, హోటల్స్ నిర్వాహకులతో ముందుగానే కుమ్మక్కై కిలో రూ.400 నుంచి రూ.450 చొప్పున ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి యథేచ్ఛగా ఆ మాంసాన్ని అమ్ముతున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో మటన్ వ్యాపారులు యథేచ్ఛగా మేక మాంసంతో దందా సాగిస్తున్నారు. మటన్ కొనుగోలు విషయంలో ప్రజలు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సైతం పలు సూచనలు చేయడం గమనార్హం.
మేకల కాపరులతో ముఠా ఒప్పందాలు
మణుగూరు మండలంలో ఎంతో మంది మేక కాపరులు ఉన్నారు. ఈ కాపరులను మటన్ వ్యాపారస్తులు తమ వైపు తిప్పుకుని మంచి సంబంధాలు కలుపుకుంటున్నారు. ఏదైనా ప్రమాదంలో లేదా రోగాల వల్ల మేకలు మరణిస్తే తమకు సమాచారం అందించాలంటూ వారి ద్వారా అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మణుగూరు మండలం సమితి సింగారంలో ఓ మేకల కాపరి తన వద్ద ఎన్నో మేకలు రోగాల బారిన పడి చనిపోతే మటన్ వ్యాపారస్తులకు సమాచారం ఇచ్చానని, వారు వెంటనే వచ్చి ఎన్నో సార్లు మరణించిన మేకలను కొనుగోలు చేశారని స్వయంగా వెల్లడించడం గమనార్హం. మరణించిన మేకలను రూ.2000 నుంచి రూ.3000 లోపే కొంటారని ఆయన వాపోయాడు. ఇలా మటన్ వ్యాపారస్తులు ముఠాగా ఏర్పడి రోగాలతో మరణించిన జంతువుల మాంసం మీద లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.
హోటళ్లు, ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా
మణుగూరు పట్టణంలో ఫుడ్ వ్యాపారం చెప్పలేనంతగా పెరిగిపోయింది. తక్కువ ధరలకే తమ దగ్గర మటన్ భోజనం అంటూ భోజన ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు పెడుతున్న ఆహారం ఎంత వరకు నాణ్యమైనదనేది చర్చనీయాంశంగా మారింది. లాభాపేక్షతో మటన్ వ్యాపారులు తక్కువ ధరకు మేక, గొర్రెల మాంసం అంటూ విక్రయాలు చేపడుతున్నారు. వీరి వద్ద కొనుగోలు చేస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసాల్ని ఫ్రీజ్ లో నిల్వ చేసి, వండి వినియోగదారులకు వడ్డిస్తున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ శూన్యం
మటన్ దుకాణాల వద్దకు అధికారులు వచ్చి చూడటం లేదనే ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. జంతువు ఆరోగ్యంగా ఉందో లేదో పశువైద్యులు పరిశీలించి, ఆరోగ్యంగా ఉంటే ముద్ర వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ అధికారి రావడం లేదు. ఏ అధికారి వచ్చి ధృవీకరించడం లేదు. మరి ఎవరు అనుమతి ఇస్తే మటన్ వ్యాపారస్తులు మాంసం విక్రయిస్తున్నారో అర్థం కావడం లేదు. రోగాల బారిన పడ్డ మేకలను కోసి ఆ మాంసాన్ని స్థానిక రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రభుత్వ హాస్టల్స్ కు సరఫరా చేస్తున్నారు. మణుగూరులో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మటన్ దుకాణాలు ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారు. నాణ్యత లేని మటన్ అమ్ముతూ లక్షల రూపాయలు సొమ్ముచేసుకొంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ మటన్ దుకాణాలు పెట్టుకోవడానికి ఏ అధికారి అనుమతులు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత
కొన్ని రోజుల క్రితం కల్తీ మాంసం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం అధికారులకు తెలిసిందే. కల్తీ మాంసం తిని విద్యార్థుల ప్రాణాలు పోతే ఎవరి బాధ్యత అని పలువురు నిలదీస్తున్నారు. ఇంకెంత మంది విద్యార్థులు, ప్రజలు అస్వస్థతకు గురి కావాలని చూస్తున్నారా అని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మటన్ దుకాణాలపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, పల్లెల్లో విచ్చలవిడిగా వెలిసిన అక్రమ దుకాణాలను రద్దు చేయాలని స్థానిక ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో డిమాండ్ చేస్తోంది.

