నాపై వచ్చే ఆరోపణలను పట్టించుకోను..
సరైన సమయంలో సమాధానం చెప్తా
ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం కొందరికి మింగుడుపడడం లేదు
పీసీసీ మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం
ఒక ఛానెల్ ప్రచారం చేస్తే అది ప్రామాణికం కాదు
: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు స్పందన
కాకతీయ, హైదరాబాద్ : తనపై వస్తున్న ఆరోపణలు, కథనాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. తనపై వచ్చే చిన్నాచితక విషయాలపై సమయాన్ని వెచ్చించనని, సరైన సమయంలో అందరికీ సమాధానం తెలుస్తుందని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సరైన వ్యక్తిని అనే నమ్మకంతోనే అధిష్టానం తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిందని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) దృష్టిలో తాను బెస్ట్ పీసీసీ చీఫ్‌నని, పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తనను అనేకసార్లు అభినందించారని తెలిపారు. పీసీసీ మార్పు అనే ప్రచారంపై స్పందిస్తూ.. ఆ విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని తేల్చిచెప్పారు. తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి స్నేహపూర్వకంగా పనిచేయడం కొందరికి మింగుడుపడడం లేదని, అందుకే ఇలాంటి ఆరోపణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
నా పనితీరును సీఎం, కార్యకర్తలు బేరీజు వేస్తారు
“నాపై ఒక ఛానెల్ తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అది ప్రామాణికం కాదు. నా పనితీరు ఎలా ఉందో బేరీజు వేయాల్సింది మా ముఖ్యమంత్రి, నా పార్టీ కార్యకర్తలు” అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. మీడియాకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందని, తాను ప్రెస్ ఫ్రీడమ్‌ను గౌరవించే వ్యక్తిని అని చెప్పారు. గాంధీ భవన్ అనేది ట్రస్ట్‌కు సంబంధించినదని, దానిపై వస్తున్న కథనాలను తాను అస్సలు పట్టించుకోనని పీసీసీ చీఫ్ కొట్టిపారేశారు.

