వడదెబ్బతో యువకుడు మృతి
కాకతీయ, పాలేరు: తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఓ యువకుడు మృతి చెందిన విచారకర ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన వ్యక్తి అకాల మరణం చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన దుంపల సాయిచరణ్ (31) కూలిపనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత రెండు రోజుల క్రితం జీవనోపాధి కోసం ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా బయట పనులకు వెళ్లాడు. తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనికి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం సాయిచరణ్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద, కుటుంబ బాధ్యతలను మోసే ఏకైక ఆధారమైన సాయిచరణ్ కండ్లముందే మరణించడంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు. యువకుడి అకాల మరణంతో గట్టుసింగారం గ్రామంలో ఒకేసారి విషాదఛాయలు అలుముకున్నాయి. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వడదెబ్బతో మృతి చెందిన సాయిచరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

