‘కుల నిర్మూలన చట్టం’ తీసుకురావాలి!
ఆలయాల్లో పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇవ్వాలి
కులరహిత సమాజంతోనే దేశంలో దాడులు, హత్యలు తగ్గుతాయి
ప్రధాని మోదీకి సామాజిక కార్యకర్త వెంకటస్వామి విజ్ఞప్తి
కాకతీయ,శంకరపట్నం: దేశంలో కుల వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసే విధంగా పార్లమెంటులో ప్రత్యేకంగా ‘కుల నిర్మూలన చట్టం’ తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల నిర్మూలన చట్టం అమల్లోకి వస్తే సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమానత్వం వస్తుందని, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఉన్నట్లే.. దేశంలోని అయోధ్య, తిరుపతి, శబరిమల, షిరిడి తదితర ప్రధాన ఆలయాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూజారులుగా సేవలందించే అవకాశం కల్పించాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాల్లో అన్ని వర్గాల వారు సమానంగా పాల్గొనే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించి చర్యలు తీసుకుంటేనే బి.ఆర్.అంబేద్కర్, జ్యోతిరావు పూలే కలలుగన్న సమాన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

