బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
దీర్ఘకాలిక అనారోగ్యంతో మనస్తాపం
మల్యాల గ్రామ శివారులో ఘటన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కట్కూరి లచ్చవ్వ (72) అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లచ్చవ్వ గత ఆరు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కరీంనగర్‌లోని అక్షయ హాస్పిటల్‌లో డయాలసిస్ చికిత్స పొందుతోంది. దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె.. సోమవారం గ్రామ శివారులో ఉన్న మల్లారపు నారాయణకు చెందిన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న చందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చందుర్తి ఎస్సై రమేష్ తెలిపారు.

