రహదారి పనుల్లో నాణ్యత లోపాలు!
రోడ్డును ప్రమాదకరంగా మారుస్తున్న కాంట్రాక్టర్
56 మూలమలుపులను సరిచేయకుండానే పనులు
అధికారుల నిర్లక్ష్యంపై టీడీపీ నేత బొల్లుమల్ల సదానందం ఆగ్రహం
కాకతీయ, చిగురుమామిడి : సుందరగిరి నుండి హుస్నాబాద్ కు జరుగుతున్న నాలుగు వరుసల రహదారి (ఫోర్ లేన్) నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించాయని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొల్లుమల్ల సదానందం ఆరోపించారు. సోమవారం ఈ రహదారి పనులను టీడీపీ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం వరకు 20 కిలోమీటర్ల మేర రూ.163 కోట్లతో ఫోర్ లైన్స్ రోడ్డు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. పనుల నిర్వహణలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హుస్నాబాద్ సబ్ స్టేషన్ నుంచి చిగురుమామిడి వరకు రూ.77 కోట్లతో మొదటి ప్యాకేజీ కింద రెండు నెలల క్రితం ప్రారంభమైన పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదన్నారు.
పాత రోడ్డు తవ్వకుండానే.. మట్టితో ఎత్తు!
కొత్త రోడ్డు వేసేటప్పుడు కనీసం ఒక మీటర్ లోతు తవ్వి గ్రావెల్, కంకర వేయాల్సి ఉండగా.. పాత రోడ్డును తవ్వకుండా ఇరువైపులా లూజ్ మట్టిని పోస్తూ ఎత్తు సరిచేస్తున్నారని సదానందం ఆరోపించారు. రోడ్డు పక్కన నరికిన చెట్ల మొదళ్లను భూమిలోనే కప్పేయడం వల్ల ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయన్నారు. పాత కలవర్టులను మట్టిలో కప్పేయడం వల్ల రాబోయే వర్షాకాలంలో నీరు నిలిచి పక్కనే ఉన్న ఇళ్లు, పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు మొత్తం 56 ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయని, వాటిని సరిచేయకుండానే రోడ్డు వేయడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
బాధిత రైతులకు న్యాయం చేయాలి..
రహదారి విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్డు పక్కన వ్యవసాయ బావులు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిగురుమామిడి మండల అధ్యక్షుడు వరుకోలు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

