కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..
చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనం
త్వరలో రూ.2 వేల కోట్లతో కరీంనగర్–జగిత్యాల రహదారి విస్తరణ
రూ.50 కోట్లతో ఆర్నకొండ–మల్యాల ద్విపాత రోడ్డు పనులకు శ్రీకారం
ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు రూ.20 వేల కోట్ల కేంద్ర నిధులు
: కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్/చొప్పదండి : రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో రూ.50 కోట్ల సీఆర్ఐఎఫ్ నిధుల అంచనా వ్యయంతో ఆర్నకొండ నుంచి మల్యాల వరకు 35 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ద్విపాత (డబుల్ రోడ్డు) రహదారి విస్తరణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ రహదారి విస్తరణతో చుట్టుపక్కల మండలాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుందని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి కొండగట్టు అంజన్న క్షేత్రానికి వెళ్లే భక్తులకు దూరభారం తగ్గుతుందన్నారు. ఏడాది గడువులోగా ఈ పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
రోడ్ల నిర్మాణానికే రూ.7 వేల కోట్లు
రవాణా సౌకర్యాలు మెరుగైతేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని, అందుకే తాను ఎంపీగా గెలిచిన నాటి నుంచి రహదారులకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చానని కేంద్ర మంత్రి తెలిపారు. గత ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకురాగా.. అందులో కేవలం రోడ్ల నిర్మాణానికే రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం చేశామని వివరించారు. రూ.2,147 కోట్లతో కరీంనగర్–వరంగల్, రూ.578 కోట్లతో ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కరీంనగర్–జగిత్యాల రహదారి విస్తరణ పనులను రూ.2 వేల కోట్ల నిధులతో అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
పార్టీల వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తాం
కేంద్ర ప్రభుత్వ నిధులైన సీఆర్ఐఎఫ్ ద్వారా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు రూ.400 కోట్లకు పైగా తెచ్చామని, ఉపాధి హామీ కింద రూ.700 కోట్లు, గ్రామీణ సడక్ యోజన కింద రూ.130 కోట్లు ఖర్చు చేశామని బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ పార్లమెంట్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే వివక్ష లేకుండా అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని, ప్రజాప్రతినిధులు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

