లింగంపేటలో టేకు మాఫియా రాజ్యం!
మామూళ్ల మత్తులో ఫారెస్ట్ శాఖ..?
కొత్తకుంట ప్రాంతంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత
చేతులు ముడుచుకుని చూస్తున్న అధికారులు
సామాన్యులపై కేసులు.. మాఫియాకు మామూళ్లతో మినహాయింపా..?
వివరణకు దొరకని రేంజ్ ఆఫీసర్ ఖలీల్..!
కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామ పరిధిలోని కొత్తకుంట ప్రాంతం ప్రస్తుతం టేకు మాఫియాకు స్వర్గధామంగా మారింది. కోట్ల రూపాయల విలువైన టేకు చెట్లను రాత్రింబవళ్లు విచ్చలవిడిగా నరికి తరలిస్తున్నా, ఫారెస్ట్ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అడవిని కాపాడాల్సిన అటవీ శాఖే అక్రమార్కులకు అండగా నిలుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “మామూళ్లు ముట్టితే అడవిని కూడా అమ్మేస్తారా?” అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తకుంట ప్రాంతంలో భారీ సంఖ్యలో టేకు వృక్షాలు నేలమట్టమవుతున్నా, ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ దందా రోజురోజుకూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నా.. కేసులు నమోదు చేయకపోవడం, రవాణా వాహనాలను పట్టుకోకపోవడం అధికారుల అంతర్గత సహకారానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.
సామాన్యుడికో న్యాయం.. మాఫియాకో న్యాయమా?
పర్యావరణ పరిరక్షణ పేరుతో చిన్నపాటి తప్పులకే గ్రామస్తులపై కేసులు పెట్టే అధికారులు.. ఇప్పుడు అడవిని ముక్కలుగా కోసి అమ్ముకుంటున్న మాఫియా ముందు ఎందుకు మోకరిల్లారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “సామాన్యుడైతే చట్టాలు.. మాఫియాకైతే మామూళ్లతో మినహాయింపా?” అంటూ స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లింగంపేట కొత్తకుంట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ టేకు దందాపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్ల నరికివేతకు పాల్పడుతున్న స్మగ్లర్లతో పాటు, వారికి పరోక్షంగా సహకరిస్తున్న ఫారెస్ట్ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అడవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరణకు దొరకని రేంజ్ ఆఫీసర్ ఖలీల్..!
లింగంపేట కొత్తకుంట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ టేకు నరికివేత వ్యవహారంపై వివరణ కోరుతూ ‘కాకతీయ’ ప్రతినిధి వేములవాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖలీల్‌ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే పలుమార్లు కాల్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. అడవుల్లో జరుగుతున్న అక్రమ టేకు దందాపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో, బాధ్యత కలిగిన అధికారి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. “అడవిని కాపాడాల్సిన అధికారులు ఫోన్‌కే స్పందించకపోతే.. ఇక అక్రమ దందాలను ఎలా అరికడతారు?” అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

