భిక్షాటనం చేస్తూ వీఓఏల వినూత్న నిరసన
ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె ఉధృతం
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు : జేఏసీ హెచ్చరిక
కాకతీయ, ఏన్కూర్ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు (గ్రామ సంఘ సహాయకులు) చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి కూడా కొనసాగింది. ఇందులో భాగంగా వీఓఏల జేఏసీ మండల అధ్యక్షుడు జంపాల రమేష్ ఆధ్వర్యంలో వీఓఏలు రోడ్లపై భిక్షాటనం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తమ పట్ల అవలంబిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఓఏ జేఏసీ మండల కార్యదర్శి గోరంట్ల చంద్రావతి, బందెల శాంతారావు మాట్లాడుతూ.. తాము సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్ధాకలితో అలమటిస్తున్న వీఓఏల వేతనాలు, ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి వీఓఏల సమస్యలపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే కాలంలో ఈ సమ్మెను మరిన్ని వినూత్న పద్ధతుల్లో ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో మండల పరిధిలోని ఐకేపీ వీఓఏలు, జేఏసీ ప్రతినిధులు మరియు మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

