పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదు
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించం
17 నామినేషన్లలో ఎంపికైన వారే అధికారిక అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రామనాథం
కాకతీయ,పినపాక: కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షుడు రామనాథం స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పినపాకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలపై ప్రచారంలోకి వచ్చిన వార్తలపై పార్టీ అధిష్టానం సీరియస్గా దృష్టి సారించిందని తెలిపారు. ఆ విషయాలపై సమగ్ర విచారణ అనంతరం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ పేరు చెప్పుకొని ఎవరైనా ప్రజలను, అధికారులను, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేస్తే అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ, క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఉన్నాయని, వాటికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతమంది వ్యక్తులు తమను తాము మండల అధ్యక్షులుగా ప్రచారం చేసుకోవడం, పత్రికల్లో వార్తలు రాయించుకోవడం జరుగుతోందని, ఇది పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన 17 నామినేషన్లలో ఎంపికైన వారే మండల అధ్యక్షులుగా గుర్తింపు పొందారని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయించిన నాయకత్వాన్ని ప్రతి కార్యకర్త గౌరవించాలని సూచించారు. గతంలో పార్టీ కార్యాలయానికి తాళం వేసిన వారే పార్టీకి మొత్తం మేమే అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ నాయకుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కోసం పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ క్రమశిక్షణతో పనిచేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీను వాసరావు, భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, ఉప్పాక సర్పంచ్ బాబురావు, ఉప్పాక ఉపసర్పంచ్ కోడెం రామ్ మోహన్ రావు, సంపత్, మార్తా మనోజ్, నక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

