ముక్కిపోతున్న వడ్లు.. పట్టించుకోని పాలకులు
40 రోజులుగా కొనుగోళ్ల కోసం రైతుల నిరీక్షణ
ప్రజాపాలన పేరుతో అన్నదాతలతో చెలగాటమా?
బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు
కాకతీయ, ఏటూరునాగారం : కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కుప్పలుగా పేరుకుపోతున్నా, అకాల వర్షాలకు తడిసి నాణ్యత కోల్పోతున్నా, రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పాలకులు, అధికారులు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు మండిపడ్డారు. రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తోందని విమర్శించారు. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని స్థానిక వరి ధాన్యం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అక్కడ నెలరోజులకు పైగా ధాన్యం విక్రయం కోసం ఎదురుచూస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని గాలికొదిలేసిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై మాట్లాడే పాలకులు ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చిన స్థానిక మంత్రి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఒక్కసారి కూడా కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. రైతులు ఎండలో, వానలో కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లోనే పాడవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కొనుగోళ్లు మందగించడంతో దాదాపు 40 రోజులుగా ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందని, అకాల వర్షాలకు తడిసి వడ్లు నల్లబడుతూ ముక్కిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కళ్లముందే పంట నాశనం అవుతుంటే కొనుగోలు చేసే నాథుడే కనిపించడం లేదన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న దుస్థితిని ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్న నిల్వలను మిల్లులకు తరలించాలని లేకుంటే రైతులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

