అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పాయం సాయం
బాధితులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటూ భరోసా
ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా అండగా ఉంటాం
క్షేత్రస్థాయిలో బాధితులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందజేత
ప్రభుత్వ సాయం త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు ఆదేశం
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కాకతీయ, మణుగూరు : కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం పండరంగాపురం పంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన గొగ్గెల అబ్బయ్య, కొమరం రాంబాబు కుటుంబాలను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం నాడు ప్రత్యక్షంగా పరామర్శించారు. అగ్ని ప్రమాదం కారణంగా నివాస గృహాలు, గృహోపకరణాలు మరియు ఇతర విలువైన వస్తువులు అగ్నికి ఆహుతై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు హామీ
బాధితుల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారికి ధైర్యం చెబుతూ, కష్టకాలంలో ప్రభుత్వం, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతన గృహాలు మంజూరు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే వారి తక్షణ అవసరాల కోసం స్వయంగా తన సొంత నిధుల నుండి ఆర్థిక సహాయం అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
అధికారులకు కీలక ఆదేశాలు
సంబంధిత రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫోన్ లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని సంపూర్ణంగా అంచనా వేయించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు త్వరలోనే సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తూ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

