ఎస్ఐఆర్ కచ్చితమైన ఓటర్ల జాబితా
: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
విపక్షాల విమర్శల వేళ కమిషనర్ స్పష్టీకరణ
రేయింబవళ్లు ఒత్తిడి ఉన్నా పారదర్శకతతో పనిచేస్తున్నారు
ఎన్నికల అధికారులపై ప్రశంసలు
11 లక్షల మంది అధికారులు, 15 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్ల కృషితోనే ఇది సాధ్యం
కాకతీయ,నేషనల్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై దేశంలో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన, నమ్మకమైన ఓటర్ల జాబితాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, రేయింబవళ్లు ఎన్నో ప్రతికూల ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా పూర్తి పారదర్శకతతో ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నందుకు ఎన్నికల అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
జాబితాల రూపకల్పనలో క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత పకడ్బందీగా సాగుతోందని సీఈసీ వివరించారు. “దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా బూత్ స్థాయి ఏజెంట్లు, అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరుగుతోంది. వీరితో పాటు 11 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు , అసిస్టెంట్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు , ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ) రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రూపొందిస్తున్నారు” అని జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.
డిప్యూటేషన్ సిబ్బందికి ధన్యవాదాలు
ఈ భారీ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న క్షేత్రస్థాయి సిబ్బంది అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని సీఈసీ గుర్తుచేశారు. ఒక పవిత్రమైన ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి, ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాల్లో ఒక దానిని తయారుచేయడానికి వీరందరూ ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవస్థతో కలిసి పనిచేస్తున్న దేశంలోని ప్రముఖ న్యాయవాదులందరికీ, అలాగే ఎండనక, వాననక శ్రమిస్తున్న 11 లక్షల బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు (వందనాలు) తెలియజేశారు. విమర్శలను పక్కనబెట్టి పారదర్శకమైన ఓటింగ్ వ్యవస్థ కోసం ఈ సవరణలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

