మరణంలోనూ వెంటాడిన కులం..!
అంత్యక్రియల వేళ వివక్ష ఆరోపణలు
వీణవంక మండలంలో కలకలం
ట్రాక్టర్ డ్రైవర్‌ను తొలగించాలని అంబేద్కర్ సంఘం డిమాండ్
కాకతీయ, కరీంనగర్ వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామంలో కుల వివక్ష ఆరోపణలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన వంతడుపుల పోచమ్మ ఇటీవల మృతిచెందగా, ఆమె దహన సంస్కారాల కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను కేటాయించాలని కుటుంబ సభ్యులు సర్పంచ్‌ను ఆశ్రయించారు. సర్పంచ్ అనుమతి ఇచ్చినప్పటికీ, ట్రాక్టర్ డ్రైవర్ కందం కిషన్‌రావు వాహనం నడిపేందుకు నిరాకరించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము తక్కువ కులానికి చెందినవారమంటూ అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ట్రాక్టర్ నడపబోనని డ్రైవర్ మొండికేశాడని, దీంతో అంత్యక్రియల సమయంలో తాము తీవ్ర మనోవేదనకు గురయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు:
ఈ ఘటనపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంస్థ కార్యదర్శి వంతడుపుల బాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వాహనాన్ని నడుపుతూ ఇలా కుల వివక్షకు పాల్పడటం దారుణమన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ దౌర్జన్య నిరోధక చట్టం (అట్రాసిటీ) కింద కేసు నమోదు చేసి, విధి నిర్వహణ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మాడ్గుల ఓదెలు, వంతడుపుల అరుణ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

