ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
ఎల్‌నినోతో వర్షపాతం తగ్గే అవకాశం
తక్కువ నీటితో పండే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి
వరి కొయ్యలు పంట అవశేషాలు కాలిస్తే కేసులు తప్పవు
రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లతో కలిసి ఆయన ఖరీఫ్ సాగు ప్రణాళికపై మీడియా సమావేశం నిర్వహించారు. భారత వాతావరణ శాఖతో పాటు అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విస్తృతంగా ఆయిల్ పామ్ సాగు
జిల్లాలోని జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న డెడ్ స్టోరేజ్ నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని పచ్చి రొట్టె విత్తనాలను సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లను ప్రభుత్వం పర్యవేక్షించి మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలు మొక్కజొన్న జొన్న పొద్దుతిరుగుడు సోయాబీన్ పంటలను కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటితో పాటు 65 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసిందన్నారు. వంటనూనెలు పప్పుధాన్యాల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితిని మార్చేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్రవ్యాప్తంగా 7 ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల పనులు సాగుతున్నాయని కల్లూరు ఫ్యాక్టరీ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగును విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
కేంద్ర విధానాలపై విమర్శ
దేశంలో పత్తి సాగు పెద్దఎత్తున జరుగుతున్నప్పటికీ విదేశాల నుంచి పత్తి దిగుమతులు చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ రైతులు నష్టపోతున్నారని దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదన్నారు. పురుగుమందుల అధిక వినియోగం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో భారత వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాణ్యమైన ఉత్పత్తుల ద్వారానే ప్రపంచ మార్కెట్లలో పోటీ పడగలమన్నారు. రైతులు పురుగుమందుల వాడకం తగ్గించిజై సహజ వ్యవసాయ పద్ధతులు నానో యూరియా వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారం తరచూ ఉత్పత్తి నిలిపివేయడం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచుతోందన్నారు.
కాలిస్తే కేసులు తప్పవు
ఖమ్మం జిల్లా ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేయడంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులు సిబ్బందిని అభినందించారు. జిల్లాలో అనేకసార్లు అవగాహన కల్పించినా కొంతమంది రైతులు వరి కొయ్యలు పంట అవశేషాలను కాలుస్తుండడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు తోటలకు నష్టం ప్రాణనష్టం సంభవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పంట అవశేషాలను కాలిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ పీ శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు పాల్గొన్నారు.

