అడిగేద్దాం..! నిలదీద్దాం..!
నామినేటెడ్ పదవుల్లో మనకు అన్యాయం
కష్టకాలంలో జెండా మోసినందుకు మిగిలింది నిందలే..అవమనాలే
పార్టీలో కూడా గౌరవం లేదు.. వలస నేతలకే పెద్దపీట
కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో గూడుకంటుకున్న అసంతృప్తి
పార్టీ పెద్దల సమక్షంలో విషయ తేల్చుకోవాలనుకుంటున్న నేతలు
శుక్రవారం పార్టీ పెద్దల రాక నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతల స్కెచ్
అధిష్ఠానం పర్యటన వేళ తీవ్ర ఉత్కంఠ..
అసంతృప్త నేతల ఆవేదనపై పెద్దలు స్పందిస్తారా?
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం మరోసారి ముఠా తగాదాలు, అంతర్గత తిరుగుబాటుతో అగ్నిగుండంగా మారింది. నామినేటెడ్ మరియు సంస్థాగత పదవుల నియామకాల వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. “అడిగేద్దాం..! నిలదీద్దాం..!” అనే నినాదంతో ఎన్నో ఏళ్లుగా పార్టీ అధికారంలోకి వస్తే తమకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశపడ్డ ద్వితీయ శ్రేణి, సీనియర్ నాయకులు ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమిటంటూ అధిష్ఠానాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ పదవులు ఆశించి భంగపడ్డ కీలక నేతలతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. శుక్రవారం జిల్లాకు రానున్న పార్టీ పెద్దలు, అధిష్ఠానం ముఖ్య నేతల పర్యటనలో తమ అంతర్గత గోడును, అసంతృప్తిని బాహాటంగా వెళ్లబోసుకుంటూ విషయాన్ని తేల్చుకునేందుకు పక్కా స్కెచ్‌తో సిద్ధమైనట్లు గాంధీభవన్ వర్గాల ద్వారా నమ్మదగిన సమాచారం అందుతోంది.
కష్టకాలంలో జెండా మోస్తే.. వలస నేతలకే పీఠాలా..?
కాంగ్రెస్ పార్టీ తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు, పోలీస్ కేసులకు భయపడకుండా వీధుల్లో నిలబడి జెండాలు మోసిన తమను పూర్తిగా పక్కన పెట్టడంపై స్థానిక క్యాడర్ రగిలిపోతోంది. కష్టకాలంలో జెండా మోసినందుకు తమకు మిగిలింది నిందలు, అవమానాలేనని ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. ఇటీవల ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీలో చేరిన వలస నేతలకు, వెనక నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన తమను కాదని, కేవలం పైరవీలు చేసుకున్న వారికే గుర్తింపు లభిస్తోందనే భావన జిల్లాలోని మెజారిటీ నాయకుల్లో వ్యక్తమవుతోందని క్షేత్రస్థాయి రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వివక్షను ఇక భరించే ప్రసక్తే లేదని, అధిష్ఠానానికి తమ నిరసన స్వరాన్ని గట్టిగా వినిపించాలని అసంతృప్త నేతలు భావిస్తున్నారు.
పెద్దల పర్యటన వేళ ఉత్కంఠ.. అధిష్ఠానం ఏం చేయబోతోంది?
పదవుల కేటాయింపులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని, స్థానిక నాయకుల ఏకపక్ష వైఖరిని శుక్రవారం రానున్న పార్టీ ఇన్చార్జులు, పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని అసంతృప్త నేతలు ఒక అంతర్గత సమావేశంలో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఒకవేళ అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ లభించని పక్షంలో, న్యాయం జరగని పక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు కూడా కొందరు నేతలు సిద్ధమవుతుండటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, ముఠా తగాదాలు మరోసారి రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తుండగా.. రానున్న వలస, సీనియర్ల వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది, ఈ అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లారుస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

