ఎద్దుల పోట్లాటలో మహిళ మృతి
మణుగూరు పీవీ కాలనీలో విషాద ఘటన
కాకతీయ, మణుగూరు : రెండు ఎద్దుల పోట్లాట మధ్యలో చిక్కుకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు గ్రామానికి చెందిన చింతల ఎల్లమ్మ మంగళవారం ఉదయం సుమారు 5:00 గంటల సమయంలో పీవీ కాలనీలో ఉంటున్న తన కొడుకు చింతల శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె తిరిగి తన ఊరు వెళ్లేందుకు కొడుకు ఇల్లు దాటి నడుచుకుంటూ బస్టాండుకు బయలుదేరింది. ఈ క్రమంలో పీవీ కాలనీ రోడ్డు మార్గంలో శ్రీధర్ భాస్కరరావు ఇంటి వద్దకు చేరుకోగానే.. రోడ్డుపై రెండు ఎద్దులు ఒకదానికొకటి పొడుచుకుంటూ తీవ్రంగా పోట్లాడుకుంటూ వచ్చాయి. ఆ ఎద్దులు ఒక్కసారిగా ఎల్లమ్మ మీదికి దూసుకువచ్చి పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంపై మృతురాలి కొడుకు శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

