సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు లైన్ క్లియర్
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం
ఎన్ఓసీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి
ప్రాజెక్టు అనుమతులను వేగిరం చేయాలని కోరిన రాష్ట్ర సర్కార్
నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్ష
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా దౌత్యపరమైన చొరవ
సాగునీటి భద్రత కల్పించే దిశగా కీలక అడుగు
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా, ఉత్తర తెలంగాణ రైతాంగానికి వరప్రదాయినిగా భావిస్తున్న ‘సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకం’ నిర్మాణానికి అవసరమైన అనుమతుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు చేరుకున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమావేశమయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చేపడుతున్న సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
ఎన్ఓసీ కోసం ప్రత్యేక విజ్ఞాపన
సమ్మక్క-సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర అనుమతులను, ముఖ్యంగా ఎన్ఓసీని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞాపన పత్రాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీటి భద్రత లభిస్తుందని మంత్రి వివరించారు.
రైతాంగ ప్రయోజనాలే లక్ష్యం
సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీటి కష్టాలను తీరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అంతర్రాష్ట్ర అంశాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటూ, దౌత్యపరమైన చొరవతో ప్రాజెక్టు అనుమతులను త్వరితగతిన సాధించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. అనుమతుల విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ కీలక భేటీ సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.

