ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. కిడ్నాప్ చేసి దోపిడీ
మహిళగా నటించి యువకుడిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు
బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కొత్తపల్లికి తరలింపు
బంగారు గొలుసు, నగదు దోపిడీ.. మార్ఫింగ్ ఫొటోలతో బెదిరింపులు
కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న 2టౌన్ పోలీసులు
కాకతీయ, కరీంనగర్ : ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువకుడి ప్రాణాల మీదకు రావడమే కాకుండా, దోపిడీకి గురయ్యేలా చేసిన ఘటన కరీంనగర్‌లో కలకలం రేపింది. నమ్మకంతో వెళ్లిన సదరు యువకుడిని కిడ్నాప్ చేసి, నగదు, బంగారాన్ని దోచుకున్న ఈ ఉదంతం తాజాగా వెలుగుచూసింది. కరీంనగర్‌కు చెందిన సాయి ఆదిత్య(19)కు ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పేరుతో ఒక అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలంగా ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకుంటూ స్నేహం పెంచుకున్నారు. అనుమానం వచ్చిన ఆదిత్య ఇటీవల వీడియో కాల్ చేయగా, అవతలి వ్యక్తి మహిళ కాదని, పురుషుడని గ్రహించాడు. ఈ క్రమంలో తనను తాను సమర్థించుకుంటూ, జరిగిన దానికి క్షమాపణ చెబుతానని నమ్మబలికి ఆదిత్యను నగరంలోని విజేత సూపర్‌మార్కెట్ సమీపానికి రమ్మని పిలిపించాడు.
కిడ్నాప్ చేసి దాడి..
నిందితుడు చెప్పినట్లుగా అక్కడికి చేరుకున్న సాయి ఆదిత్యను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కొత్తపల్లి శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతనిపై దాడి చేసి, మెడలో ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నారు. అంతటితో ఆగకుండా, సదరు యువకుడి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి, బలవంతంగా రూ. 30 వేల నగదును వసూలు చేశారు. బాధితుడు సాయి ఆదిత్య కరీంనగర్ 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో స్నేహం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

