పానీపూరి తిన్న 15 మంది చిన్నారులకు అస్వస్థత!
తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఘటన
తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు
బాలుడికి తీవ్ర జ్వరంతో పాటు.. ఫిట్స్
బాధితులందరికీ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని 15 మందికి పైగా చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి పానీపూరి తిన్న కొద్దిసేపటికే చిన్నారులంతా ఒక్కొక్కరుగా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో పడిపోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
బాలుడికి ఫిట్స్.. తల్లిదండ్రుల ఆందోళన
బాధితుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడికి వైద్యులు ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యాధికారులు వెల్లడించారు. చిన్నారుల అనారోగ్యానికి అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉండగా, పూర్తి స్థాయి వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వైద్యులు పేర్కొన్నారు.
ఫుడ్ పాయిజనింగ్ కోణంలో దర్యాప్తు
అయితే చిన్నారుల అస్వస్థతకు పానీపూరి తినడమే కారణమా? లేక కలుషిత నీరు లాంటి మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా ఇది ఫుడ్ పాయిజనింగ్ ఘటన అయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన వైద్య సిబ్బంది కేసీఆర్ నగర్ కాలనీలో పర్యటించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తమ పిల్లలు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కాలనీలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

