నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ తప్పదు
భారీ వర్షాల వేళ ముందస్తు అప్రమత్తత అవసరం
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశం
కాకతీయ, ఖమ్మం : జిల్లాలో రానున్న రోజుల్లో భారీ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న చెరువులు, కుంటలు, వంతెనలు మరియు చప్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ సహాయం అందించేలా సిద్ధంగా ఉండాలని, మున్సిపల్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ రహదారులపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులను నకిలీ విత్తనాల ముఠాల నుండి కాపాడాలని ఆదేశించారు. ప్రముఖ కంపెనీల పేరుతో నాసిరకం విత్తనాలను అంటగట్టి మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ ధరకు వస్తున్నాయని తెలియని వ్యక్తుల దగ్గర రసీదు లేకుండా విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు. గ్రామాల్లో అనుమానిత దళారులపై నిఘా పెట్టామని, అక్రమ విక్రయాలు జరిగితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మార్కెట్లో అక్రమ విక్రయాలు జరగకుండా టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు.

