మా పిల్లలు ప్రభుత్వ బడికే
మానాల గ్రామస్తుల చారిత్రాత్మక తీర్మానం
ప్రైవేట్ పాఠశాల బస్సులకు నో ఎంట్రీ
ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ఏకగ్రీవ నిర్ణయం
కాకతీయ, వేములవాడ/రుద్రంగి : ప్రభుత్వ విద్యను పరిరక్షించి, గ్రామంలోని పాఠశాలను విద్యార్థులతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామస్తులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాల మూతపడే పరిస్థితి రావడంతో.. గ్రామంలోని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామస్తుల నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ, ప్రైవేట్ పాఠశాలల బస్సులు తమ గ్రామంలోకి రాకుండా చూడాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకు, అలాగే సంబంధిత విద్యాశాఖ అధికారులకు గ్రామస్తులు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే గ్రామీణ విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని గ్రామ నాయకులు తెలిపారు. పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను కల్పించడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోధన అందేలా విద్యాశాఖ అధికారులతో చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ప్రభుత్వ విద్యను ఆదుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం గ్రామమంతా ఒకే వేదికపైకి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, లక్కాకుల రమేష్, పిసరి భూమయ్య, లక్కాకుల శ్రీనివాస్, చెదలు నవీన్, వివిధ సంఘాల సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

