నక్ష సర్వేను వేగవంతం చేయాలి
గడువులోగా భూ సర్వే, నమోదు పూర్తి చేయాలి
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు
అధికారులకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాలు
కాకతీయ, మణుగూరు, జూన్ 18: భూముల రీ-సర్వే, హద్దుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం మణుగూరులో పర్యటించిన కలెక్టర్, ఆర్.ఓ.ఆర్. (రికార్డ్ ఆఫ్ రైట్స్) నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకుంటూ, భూ రికార్డులను అత్యంత ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కలెక్టర్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను, కోడిపుంజుల వాగు బ్రిడ్జి పరిసరాలను పరిశీలించారు. వరదల సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, వైద్య సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. భూములకు సంబంధించిన వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని,ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.నక్ష పైలట్ ప్రాజెక్టు ద్వారా భూ రికార్డుల సమగ్రత, పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు భూములకు సంబంధించిన సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నీటిమట్టం పెరిగిన సమయంలో కోడిపుంజుల వాగు ద్వారా ఎదురు నీరు ప్రవహించడం వల్ల ఏర్పడే ముంపు పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరదల సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు,ప్రజల తరలింపు ఏర్పాట్లు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు,ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై అధికారులని అడిగి తెలుసుకున్నారు .
డ్రైనేజీ వ్యవస్థల పరిశీలన
అనంతరం మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల నుండి వచ్చే నీటి ప్రభావంతో ముంపునకు గురయ్యే గాంధీనగర్, సుందరయ్య నగర్, వినాయక నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. డ్రైనేజీల్లో పూడిక, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు వేగంగా వెళ్లే విధంగా కాలువలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.వాతావరణ హెచ్చరికలు, నీటిమట్టాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

