పెట్రోల్ బంక్ ముందు మహిళ ఆందోళన
జీతం చెల్లించలేదని ఆరోపణలు, బంక్ యాజమాన్యంపై వాదన
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జీతం చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ మహిళ పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగిన ఘటన గురువారం ఉదయం వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలో కలకలం రేపింది. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న మహ్మద్ రజియా అనే మహిళ, తనకు రావాల్సిన జీతం వెంటనే చెల్లించాలంటూ బంక్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మహిళను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ మహిళ తన పట్టు వీడకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మరోవైపు, బంక్ యాజమాన్యం స్పందిస్తూ, సదరు మహిళ విధుల్లో ఉన్న సమయంలో లెక్క చూపకుండా డబ్బులు సొంతానికి వాడుకుందని, పైగా తనకే డబ్బులు రావాల్సి ఉందంటూ అసత్య ఆరోపణలతో గొడవ చేస్తోందని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న పోలీసులు, ఈ గొడవను రోడ్డుపై కాకుండా పోలీస్ స్టేషన్లో తేల్చుకోవాలని సూచించారు. దీంతో సదరు మహిళ పోలీసులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

