మణుగూరులో గంజాయి ముఠా అరెస్టు
80 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
నిందితుల నుంచి ఫార్చ్యూనర్ కారు స్వాధీనం
భద్రాచలం నుంచి మణుగూరుకు తరలిస్తుండగా పోలీసుల దాడులు
కాకతీయ, మణుగూరు : భద్రాచలం నుంచి మణుగూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, మణుగూరు ఎస్సై మరియు సిబ్బంది గురువారం ఉదయం తేగూడెం సమ్మక్క-సారలమ్మ గుడి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. భద్రాచలం వైపు నుండి మణుగూరుకు వస్తున్న ఫార్చ్యూనర్ కారు (RJ 3 UA 4386)ను ఆపి తనిఖీ చేయగా, కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నేపథ్యం..
అరెస్ట్ అయిన వారు రాజస్థాన్ రాష్ట్రం, జైసల్మేర్ జిల్లాకు చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్ర కుమార్ మరియు కపిల్ దేవ్. వీరికి కపిల్ దేవ్ అనే వ్యక్తి గంజాయి రవాణాకు సహకరించాలని, ప్రతిఫలంగా రూ. 50 వేలు ఇస్తానని ఆశ చూపడంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బుధవారం రాత్రి కలిమెళ్ళలో గంజాయి ప్యాకెట్లను కారులో నింపుకుని మణుగూరు వైపు వస్తుండగా పోలీసులకు చిక్కారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సమర్థవంతంగా వ్యవహరించిన మణుగూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

