హోటళ్లు, లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
గుర్తింపు కార్డులు లేని వారికి గదులు ఇవ్వొద్దు
సీసీటీవీ నిఘా తప్పనిసరి : ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్
కాకతీయ, ఖమ్మం టౌన్: నేరాలను అరికట్టేందుకు, నగరంలో భద్రతను పటిష్టం చేసేందుకు ఖమ్మం అర్బన్ పోలీసులు లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖానాపురం హవెలి ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జీలలో రికార్డులను, గెస్ట్‌ల గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గెస్ట్ నుండి ఒరిజినల్ ఐడీ కార్డులను తీసుకుని, వాటి జిరాక్స్‌లను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. సరైన గుర్తింపు కార్డులు లేని వ్యక్తులకు గదులు కేటాయించకూడదన్నారు. హోటల్ ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ గేట్లు, రిసెప్షన్ ఏరియాల్లో హెచ్‌డీ సీసీటీవీ కెమెరాలు 24/7 పనిచేసేలా చూడటం యాజమాన్యం బాధ్యత అనిపేర్కొన్నారు. లాడ్జీలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు లేదా అసాధారణ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిబంధనలు పాటించని, రికార్డులు నిర్వహించని లాడ్జీల యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

