నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు కల్పన
విత్తన విక్రయ కేంద్రాలు, గోదాముల ఆకస్మిక తనిఖీలు
కాకతీయ, గీసుగొండ : నకిలీ విత్తనాలు విక్రయించినా, అనుమతి లేని విత్తనాలను నిల్వ చేసినా విత్తన చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు కల్పన హెచ్చరించారు. మండలంలోని విశ్వనాధపురం, మచ్చాపురం, గొర్రెకుంట గ్రామాల్లోని విత్తన విక్రయ కేంద్రాలు, గోదాములు, విత్తన శుద్ధి కేంద్రాలను వ్యవసాయ శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ కల్పన మాట్లాడుతూ లైసెన్స్ నిబంధనల మేరకు సోర్స్ సర్టిఫికెట్ ఉన్న విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. విత్తనాల నిల్వలు, ధరల పట్టికలను రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని, విక్రయ సమయంలో లాట్ నంబర్, గడువు తేదీ వివరాలతో కూడిన రశీదును తప్పనిసరిగా అందజేయాలని తెలిపారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహించాలని సూచించారు.
లైసెన్సులు రద్దు చేస్తాం
గడువు ముగిసిన, అనుమతి లేని, లూజ్ విత్తనాలను విక్రయించరాదని, గోదాముల్లో విత్తనాలను తేమ తగలకుండా శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయాలని ఆమె సూచించారు. నిబంధనల ఉల్లంఘనపై అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో రాష్ట్ర విత్తన పరిశీలక అధికారి గోవర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

