బాలికపై లైంగిక దాడి.. దోషికి 20 ఏళ్ల జైలు
పోక్సో కోర్టు కఠిన తీర్పు.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం
కాకతీయ, ఏటూరునాగారం: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ సంచలన తీర్పునిచ్చారు. కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ (45) బాలికపై లైంగిక దాడికి పాల్పడగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయడంతో, విచారణ చేపట్టిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. శిక్షతో పాటు నిందితుడికి రూ. 6 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో సమర్థవంతంగా వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులను జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అభినందించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

