రైతు బంధు బందై.. ‘రాహుల్ బంధు’
రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. మాఫియా రాజ్యం
నేనైతే కేసీఆర్ అంత మంచోడిని కాదు
సాఫ్ట్‌వేర్ అనుకుంటే పొరపాటే, పక్కా హార్డ్‌వేర్‌ని
గులాబీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టను
‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్.. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్
పరకాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, పరకాల/దామెర : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనకు బదులు పూర్తి స్థాయిలో మాఫియా పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకాల నియోజకవర్గం దామెర మండల పరిధిలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ మార్క్ పాలనలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని, గత ప్రభుత్వం అందించిన రైతుబంధు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ‘రాహుల్ బంధు’ను జోరుగా నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన ప్రభుత్వం కంటే మాఫియా తరహా వ్యవస్థ నడుస్తోందని విమర్శించిన కేటీఆర్.. “నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు.. నన్ను సాఫ్ట్‌వేర్ అనుకుంటున్నారేమో, నేను పక్కా హార్డ్‌వేర్‌ని.. ఎవ్వరినీ వదిలిపెట్టా” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తూ, వేధించే ప్రయత్నాలు చేస్తున్న అధికారులను, అధికార పార్టీ నాయకులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీ శ్రేణులకు తాము ఎల్లప్పుడూ కొండంత అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. గులాబీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు సప్త సముద్రాలు దాటి వెళ్లినా సరే.. వెతికి మరీ పట్టుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతును నొక్కివేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దురహంకార వైఖరిని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ విమర్శల జడివాన కురిపించారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని ఆరు గ్యారంటీలు, వందలాది హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో 100 శాతం విఫలమైందన్నారు. థియేటర్లలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయినట్లే, సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి తన పాలన గురించి భారీగా ప్రచారం చేసుకున్నారని.. కానీ క్షేత్రస్థాయిలో ఆయన సినిమా పూర్తిగా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాజకీయంలో పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు తీవ్ర నిరాశలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు.
నిర్లక్ష్యం వల్లే ఓడిపోయాం.. మళ్లీ మనదే అధికారం
తాము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని, కార్యకర్తలను కొంత విస్మరించామని కేటీఆర్ బహిరంగంగా అంగీకరించారు. అయితే రానున్న ఐదేళ్లలో కార్యకర్తల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. “మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది కార్యకర్తలైన మీ శ్రమ వల్లే. మన నిర్లక్ష్యం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం. ‘నమ్మి మోసపోవద్దు.. ఆ తర్వాత గోసపడతారు’ అని నాడు అధినేత కేసీఆర్ పదే పదే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు” అని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో తిరుగులేని శక్తిగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, పార్టీకి మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ భారీ ఆత్మీయ సమ్మేళనంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత, కీలక నాయకులు సాంబారి సమ్మా రావు, ఏనుగు రాకేష్ రెడ్డి, లింగంపల్లి కిషన్ రావు, వాసుదేవ రెడ్డి, చింతం సదానందం సహా స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు.

