కాకతీయ కథనానికి స్పందన
రుద్రంగి తహసీల్దార్ కార్యాలయానికి శాశ్వత భవనం
రూ.2.50 కోట్ల నిధులు మంజూరు!
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయ సొంత భవనం కల త్వరలోనే సాకారం కానుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా సరైన వసతులు లేక తాత్కాలిక భవనంలోనే కొనసాగుతున్న ఈ కార్యాలయం దుస్థితిపై కాకతీయ మీడియాలో ప్రచురితమైన కథనానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. నూతన భవన నిర్మాణం కోసం రూ.2 కోట్ల 50 లక్షల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాకతీయ కథనంతో కదిలిన యంత్రాంగం
రుద్రంగి మండలంలో తహసీల్దార్ కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో నిత్యం వివిధ ధ్రువపత్రాలు, భూ సమస్యల కొరకు వచ్చే ప్రజలు, రైతులు, లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిమిత స్థలం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇటు వచ్చే ప్రజలకే కాకుండా అటు అధికారుల పనితీరుకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రజా సమస్యను కాకతీయ మీడియా కథనం ద్వారా ప్రధానంగా వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన ప్రభుత్వం.. శాశ్వత పరిష్కారం దిశగా నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

మండల ప్రజల్లో హర్షాతిరేకాలు
రూ.2.50 కోట్ల భారీ వ్యయంతో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కలిగిన సరికొత్త తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రుద్రంగి మండల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు వేగంగా, మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ పరిపాలన కూడా మరింత సమర్థవంతంగా సాగడానికి వీలవుతుంది. ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వం వేగంగా స్పందించేలా చేసిన కాకతీయ మీడియాపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి మీడియా ఏ విధంగా వారధిగా నిలుస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.

