ఇసుక ర్యాంపులో ‘అక్రమ’ వసూళ్ల పర్వం!
ఆన్‌లైన్ చెల్లింపులైనా.. ర్యాంపు వద్ద అదనపు భారం
లారీ ఒక్కంటిపై రూ. 2,500 వసూలు చేస్తున్న గుత్తేదార్లు
ప్రశ్నిస్తే ‘బ్లాక్‌లిస్ట్’.. సెల్‌ఫోన్లపై ఆంక్షల కత్తెర
టీజీఎండీసీ సిబ్బంది కనుసన్నల్లోనే దందా
కాకతీయ, ఏటూరునాగారం : ప్రభుత్వ పారదర్శకమైన విధానాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు పొంతన లేకుండా పోతోంది. ములుగు జిల్లా నూగూరు–వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రవరం ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా అదనపు రుసుములను వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లారీ డ్రైవర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని డీడీల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నా, ర్యాంపు వద్ద స్థానిక గుత్తేదార్లు లారీ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.
అడ్డగోలుగా అదనపు రుసుములు
నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ చెల్లింపులు పూర్తయిన తర్వాత ర్యాంపు వద్ద ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకూడదు. కానీ, వీరభద్రవరం ర్యాంపులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతి లారీకి వె-బిల్లు పేరుతో రూ. 100, గ్రామపంచాయతీ నిధులని రూ. 100, జేసీబీ లోడింగ్‌కు రూ. 200, కాంటా వద్ద లెవలింగ్‌కు రూ. 100, లోడింగ్ ఛార్జీగా రూ. 2,000.. ఇలా మొత్తం రూ. 2,500 అదనంగా చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే లోడింగ్ ఆలస్యం చేయడం, లారీలను గంటల తరబడి నిలిపివేయడం వంటి చర్యలతో డ్రైవర్లను మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఫోన్ల దూరం.. బ్లాక్‌లిస్ట్ భయం
అక్రమ వసూళ్లను ఎవరైనా ప్రశ్నిస్తే లేదా వీడియో తీస్తే, సదరు లారీని ‘బ్లాక్‌లిస్ట్’ చేస్తామని డ్రైవర్లను ప్రైవేట్ సిబ్బంది బెదిరిస్తున్నట్లు సమాచారం. ర్యాంపులోకి వెళ్లేటప్పుడే సెల్‌ఫోన్లను బయటే ఉంచాలని ఆంక్షలు విధించడం వెనుక, అక్రమాల వ్యవహారం బయటకు పొక్కకూడదనే గుత్తేదార్ల కుతంత్రం దాగి ఉందని డ్రైవర్లు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లాలోని ఇతర క్వారీల్లో వసూళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇక్కడ అప్రమత్తమైన సిబ్బంది నిఘా పెంచి అక్రమాలను రహస్యంగా సాగిస్తున్నారు.
అధికారుల మౌనం.. అక్రమాలకు వంత
ఈ అక్రమ వసూళ్లు టీజీఎండీసీ సిబ్బంది కళ్ల ముందే జరుగుతున్నా, వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన విధానాలను నీరుగారుస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. సంబంధిత పీవో ను వివరణ కోరగా ఆయన అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, వీరభద్రవరం ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు, డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

