దోపిడీ ముఠా అరెస్ట్
నిందితుల్లో ఆర్ఎస్సై, కానిస్టేబుల్.. 12 మంది రిమాండ్
మూడు కార్లు, డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్ల బండిల్స్ స్వాధీనం
బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తామంటూ బురిడీ
అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
వివరాలు వెల్లడించిన ఏసీపీ వసుంధర యాదవ్
కాకతీయ,ఖమ్మం బ్యూరో : అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న 12 మంది సభ్యుల అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.17.60 లక్షల నగదు, 2 ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, టీవీఎస్ స్కూటీ, పోలీస్ యూనిఫామ్, 16 సెల్‌ఫోన్లు, 80 బండిళ్ల నకిలీ ‘చిల్డ్రన్ బ్యాంక్’ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఈ సంచలన కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల్లో టీజీఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన ఆర్ఎస్సై బేరా కేశవరావు, కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్ ఉండటం గమనార్హం.
4రెట్లు ఇస్తామంటూ ఎర..!
ఏసీపీ తెలిపిసిన వివరాలు ప్రకారం.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి జూన్ 25న సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగుచూసింది. ఈ ముఠా ప్రధాన సూత్రధారి ఈద చంటిబాబు (ఏ1) విభిన్నమైన సిమ్ కార్డుల ద్వారా అమాయకులకు ఫోన్ చేసేవాడు. తన పేరు మహేందర్ రెడ్డి అని, చంద్రం అని వేర్వేరు పేర్లు చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకునేవాడు. “నా ఖాతాలో రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉంది, ఐటీ సమస్యల వల్ల దాన్ని వైట్ మనీగా మార్చాలనుకుంటున్నాను. మీరు నాకు రూ.10 లక్షల నగదు ఇస్తే అందుకు బదులుగా మీ ఖాతాలో రూ.40 లక్షలు వేస్తాను. అందులోంచి మీ రూ.10 లక్షలు పోను, మిగిలిన రూ.30 లక్షల్లో మీ కమిషన్ రూ.12 లక్షలు ఉంచుకుని మిగతా రూ.18 లక్షలు నాకు నగదు రూపంలో ఇవ్వాలి” అంటూ ఆశ చూపించేవాడు.
నకిలీ పోలీసులతో ‘దోపిడీ’ నాటకం
ఈ మాటలు నమ్మి బాధితులు డబ్బులు పట్టుకుని ముఠా సభ్యులు చెప్పిన ప్రాంతానికి వచ్చేవారు. అక్కడ చంటిబాబు అనుచరుడు డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగుతో సిద్ధంగా ఉండేవాడు. బాధితుడు తెచ్చిన ఒరిజినల్ నగదును లెక్కబెడుతున్న సమయంలో.. ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఆర్ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు సివిల్ డ్రస్సులో ఉన్న ముఠా సభ్యులు కార్లలో అక్కడికి చేరుకునేవారు. తాము పోలీసులమని నమ్మించి, “మీరు దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం” అని బాధితులను తీవ్రంగా బెదిరించేవారు. అనుమానం రాకుండా తమ ముఠా మనిషిని కూడా కొడుతూ, బాధితుల వద్ద ఉన్న ఒరిజినల్ నగదును గుంజుకుని కార్లలో పారిపోయేవారు.
పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు
నమ్మకమైన సమాచారం మేరకు బుధవారం ఉదయం సత్తుపల్లి మండలం గంగారంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు, ఖమ్మం, కర్నూలు, సత్యసాయి జిల్లాలకు చెందిన ఈద చంటిబాబు, ముళ్ళగిరి వర్ధన్ (కానిస్టేబుల్), బేరా కేశవరావు (ఆర్ఎస్సై), మువ్వా సత్యనారాయణ, మారుముడి మధు, గోరంట్ల గౌతమ్ కుమార్, కర్లపూడి నవీన్, నక్కా నాగరాజు, సాగి సుబ్బరాజు, కాపా శ్రీనివాస్, దుడుగురు కురబ గణేష్, ఉపేంద్రం జనార్ధన రాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి సిమ్ కార్డులు సమకూర్చిన రామాంజనేయులు, రాజు అనే ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

