అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అంతం
ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య
సహకరించిన మరో నిందితుడు
జాకారం హత్య కేసును చేధించిన ములుగు పోలీసులు
నిందితురాలితో పాటు మరో ఇద్దరి అరెస్ట్
హత్యకు ఉపయోగించిన కారు, సెల్‌ఫోన్లు, నైలాన్ తాడు స్వాధీనం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండలం జాకారం శివారులో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన కేసులో, మృతుడి భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 26న మధ్యాహ్నం జాకారం గ్రామ శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వెనుక వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామ కరోబార్ ఫిర్యాదు మేరకు ములుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం చేశారు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన పెయింటర్ సిరిపంగ నర్సింహులు (42)గా గుర్తించారు. విచారణలో మృతుడి భార్య శోభారాణికి, అలా పెద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ బంధానికి నర్సింహులు అడ్డుగా ఉండటంతో, శోభారాణి తన ప్రియుడు వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి నీల దుర్గారెడ్డితో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడు, బండరాయి, సాంట్రో కారు (ఏపీ 10 ఏపీ 5631), మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

