ఉపసర్పంచ్‌ను చంపింది భార్యే
భార్యతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్
వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాలే కారణం
రూ. 4 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య
వీడిన సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య మిస్టరీ
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ దారుణానికి స్వయంగా ఆయన భార్యే సూత్రధారిగా వ్యవహరించినట్లు జిల్లా ఎస్పీ శబరిష్ వెల్లడించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. యాకయ్యకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన భర్త ఆస్తిని సదరు మహిళకు రాసిస్తాడేమోనన్న భయంతో భార్య యశోద (53) ఆందోళన చెందింది. ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని పథకం వేసిన ఆమె, మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి రూ. 4 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకుంది. పథకం ప్రకారం నిందితులు యాకయ్యను ఇనుప రాడ్‌తో కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి మెడలోని బంగారు గొలుసును దోచుకుని పరారయ్యారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి యశోదతో పాటు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 7 సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు మరియు బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

