కాకతీయ కథనానికి స్పందన
చేర్యాలలో ప్రమాదకర కోనో కార్పస్ చెట్ల తొలగింపు
ప్రజల సమస్యపై స్పందించిన అధికారులు
కాకతీయ, చేర్యాల: ‘కాకతీయ’ పత్రికలో కోనో కార్పస్ చెట్ల వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పత్రికలో వెలువడిన కథనాన్ని పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖ అధికారులు శనివారం కోనో కార్పస్ చెట్ల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ చెట్ల వేర్లు వేగంగా విస్తరించి రోడ్లు, డ్రైనేజీలు, భూగర్భ పైపులైన్లకు నష్టం కలిగించే అవకాశం ఉండటం, ముఖ్యంగా కొందరికి అలర్జీలు, శ్వాస సంబంధిత వ్యాధులు రావడంతో పాటు పర్యావరణపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానికులు అధికారుల చర్యను స్వాగతిస్తూ, తొలగించిన చెట్ల స్థానంలో స్థానిక జాతికి చెందిన నీడనిచ్చే మొక్కలను నాటాలని కోరుతున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన కాకతీయ పత్రిక కథనానికి స్పందించి అధికారులు చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.


