హెచ్చార్సీ పిటిషన్ ఎవరి మెడకు?!
ఇసుక దందాలో కలకలం రేపుతున్న భాస్కర్రావు ఫిర్యాదు
ఇరకాటంలో ములుగు జిల్లా అధికార పార్టీ నేతలు
సబ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ములుగు జిల్లాలో రాజకీయ వేడి
కేసులు, దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల అడుగులు కీలకం
అనుచరుల తీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం.. స్థానిక నేతలపై ఆరా?
బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమాలోచనలు?!
గులాబీ పార్టీకి రాజకీయ అవకాశం..అస్త్రంగా మారిన అంశం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లాలోని చుంచుపల్లి ఇసుక రీచుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇసుక దందాను ఆసరా చేసుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్షాలకు, సబ్ కాంట్రాక్టర్ బెల్లంకొండ వెంకటేశ్వర్ రావు అలియాస్ భాస్కర్ రావు వేసిన హెచ్ఆర్సీ పిటిషన్ ఒక అస్త్రంగా దొరికింది. సొంత పార్టీలోనే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడం, మంత్రి సీతక్క ఈ ఇసుక వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. ములుగు జిల్లా చుంచుపల్లి ఇసుక రీచుల విషయంలో సబ్ కాంట్రాక్టర్ బెల్లంకొండ వెంకటేశ్వర్ రావు అలియాస్ భాస్కర్ రావు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం సంచలనంగా మారింది. చుంచుపల్లి గ్రామానికి చెందిన సొసైటీల అధ్యక్షుడు కోరం అబ్బయ్య, కార్తీక్, డీసీసీ అధ్యక్షుడు అశోక్, మరో వ్యక్తి కొండం బాలకృష్ణ, ములుగు ఎస్పీ, పస్రా సీఐ, మంగపేట ఎస్సైలను ప్రతివాదులుగా చేరుస్తూ భాస్కర్రావు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అయితే హెచ్ఆర్సీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత పోలీసులు ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు ఉండటంతో, సంబంధిత అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం.

ఆధారాలతో ఫిర్యాదు… పోలీసులకు చిక్కులు..
డయాలసిస్ పేషెంట్ అయిన భాస్కర్ రావు వద్ద ఆధారాలేమీ లేవని అనుకున్న వారికి, ఇప్పుడు ఆయన వద్ద ఉన్న ఆధారాలు మింగుడుపడకుండా తయారవుతున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి డీసీసీ అధ్యక్షుడు అశోకే కారణమని, అంతా ఆయనే చూసుకుంటున్నాడని చుంచుపల్లి గ్రామ ట్రైబల్ సొసైటీ ప్రతినిధి చెప్పిన మాటలకు సంబంధించిన ఆడియో రికార్డులను భాస్కర్ రావు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రిమెంట్ పత్రాలను దాఖలు చేసిన ఆయన తాజాగా సేకరించిన ఆడియో రికార్డులను కూడా హెచ్ఆర్సీకి, ములుగు జిల్లా ఎస్పీకి అందజేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి హెచ్ఆర్సీకి నివేదిక ఇస్తే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని, దీంతో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడటం ఖాయమన్న విశ్లేషణ రాజకీయ నేతల మధ్య సాగుతుండటం గమనార్హం.
కేటీఆర్ వ్యూహం.. సీతక్క అసహనం..
అధికార పార్టీ నేతలుగా చెలాయిస్తున్న వారే ఇసుక దందా వెనుక ఉండి నడిపిస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో, భాస్కర్ రావు ఫిర్యాదు ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ములుగు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ములుగు జిల్లా ఇసుక రీచ్ల కేటాయింపులు.. ఇతరాత్ర వ్యవహారాలపై ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, భాస్కర్ రావు అంశం రాజకీయంగా కలిసి వచ్చిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు భాస్కర్ రావు వ్యవహారం మీడియాలో కథనాలుగా రావడంతో మంత్రి సీతక్క సీరియస్ అయ్యారని సమాచారం. ఇసుక వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తలదూర్చి, ఇంతటి వివాదానికి కారణం కావడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఈ వ్యవహారంపై ఆమె పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మంత్రి ఆగ్రహంతో ఇప్పుడు స్థానిక నేతల్లో వణుకు మొదలైంది.
ఎవరి మెడకు చుట్టుకోనుందో?
ములుగు జిల్లాలో ఇసుక దందా అనేది కేవలం ఒక ఆర్థిక వ్యవహారం మాత్రమే కాకుండా అది రాజకీయ పలుకుబడికి నిదర్శనంగా మారింది. అధికార పార్టీ నేతలే తెరవెనుక ఉండి సొసైటీలను, అగ్రిమెంట్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు హెచ్ఆర్సీ వేదికగా చట్టబద్ధమైన విచారణకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చడం వెనుక, కేవలం ఇసుక దందానే కాకుండా పరిపాలనా యంత్రాంగంపై కూడా ప్రభావం ఉందన్నది స్పష్టమవుతోంది. మంత్రి సీతక్క ఆగ్రహం ఒకవైపు, ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మక పావులు మరొకవైపు ఉండటంతో, ఈ హెచ్ఆర్సీ పిటిషన్ ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్నది ములుగు రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతోంది. దర్యాప్తు గనుక నిజాయితీగా సాగితే, ములుగు ఇసుక దందా వెనుక ఉన్న అసలు బండారం బయటపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

