సర్వేయర్లకు వేతనం పెంచి..ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రభుత్వమే కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలి
న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పోరు ఉధృతం
సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్యామ్ నాయక్
కాకతీయ, మయూరి సెంటర్ : తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలకు 30 వేల రూపాయల వేతనం అందించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్యామ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమను కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎకరం సర్వే చేయడానికి ప్రభుత్వం ఇచ్చే 50 రూపాయలు ప్రయాణ ఖర్చులకు కూడా చాలడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం శిక్షణ ఇచ్చి వదిలేశారే తప్ప, తమకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆయన విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్యోగం లేదనే మనస్తాపంతో మృతి చెందిన బంగారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి సర్వేయర్లందరికీ ఉద్యోగాలు కల్పించాలని, 30 వేల రూపాయల వేతనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, కోశాధికారి దామాల మణి, జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ కారంపూడి, కార్యదర్శులు షేక్ సలీం, తోట సాయి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నందిగం సందీప్, వేల్పుల భవాని తదితరులు పాల్గొన్నారు.

