- యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం
- 38.16 టీఎంసీల సామర్థ్యం పూర్తి వినియోగం
- 22 రిజర్వాయర్లు నింపి రైతులకు సాగునీరు
- పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేశాం
- సాగునీరు, తాగునీటి అవసరాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
- దేవాదుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తాం
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కాకతీయ, ఏటూరునాగారం : దేవాదుల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరత లేకుండా అన్ని పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక–విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపి దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భూసేకరణను వేగవంతంగా పూర్తి చేసి ప్రాజెక్టు పనుల్లో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడంతో పాటు పెండింగ్ బిల్లులను విడుదల చేసినట్లు వెల్లడించారు. సాగునీరు, తాగునీటి అవసరాలకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, గోదావరి జలాలతో రైతాంగానికి శాశ్వత భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సోమవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో లెనిన్ వస్సల్ టొప్పో, డీఎఫ్‌వో వికాస్ మీనాలు ఘన స్వాగతం పలికారు.
ప్రాజెక్టు పనులపై క్షేత్రస్థాయి పరిశీలన..
మంత్రులు తుపాకులగూడెం సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ప్రవాహం, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు వాటర్ పాయింట్‌ను సందర్శించి మోటార్ల పనితీరు, ఎత్తిపోతల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు, భూసేకరణ, పంపింగ్ వ్యవస్థ, మోటార్ల పనితీరు, సాగు–తాగునీటి అవసరాలు, ఎత్తిపోతల సామర్థ్యం తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షలో ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేయడం, పరిపాలనా, సాంకేతిక అడ్డంకులను వెంటనే తొలగించడం, పనుల అమలుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ముందే అంచనా..
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న ఎల్‌నినో పరిస్థితుల వల్ల రాష్ట్రంలో వర్షాభావం ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజా ప్రభుత్వం దూరదృష్టితో కార్యాచరణ చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం పలుమార్లు సమీక్షలు నిర్వహించి వ్యవసాయం, తాగునీరు, జలవనరులపై ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. గోదావరి నదిలో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలనే లక్ష్యంతో విద్యుత్ వ్యయం ఎంతైనా వెనుకాడకుండా నీటిని ఎత్తిపోసి చెరువులు నింపడం, భూగర్భ జలాలను పెంపొందించడం, గ్రామీణ–పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించడం, వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేవాదుల ఎత్తిపోతల పథకం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టు అని దీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి రైతులకు నమ్మకమైన నీటి వనరును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
రూ.194 కోట్ల బిల్లుల విడుదల.. 1
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టులో ప్రస్తుతం 10 పంపుల్లో 7 పంపులు పనిచేస్తున్నాయని మరో ఒకటి రెండు రోజుల్లో అన్ని 10 పంపులు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.194 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. భూసేకరణకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చి పనులు ఎక్కడా నిలిచిపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 38.16 టీఎంసీల సామర్థ్యానికి అనుగుణంగా నీటిని ఎత్తిపోసి కొత్త, స్థిరీకరణ ఆయకట్టులకు సాగునీరు అందించేలా పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, సుమారు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర రైతాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, పంపుల నిర్వహణ సంస్థల మధ్య సమన్వయం ఉంటేనే పంపింగ్ వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

