విద్య పేరుతో దోపిడీ..
ఫీజుల దందాకు అడ్డుకట్ట ఎప్పుడు?
అధిక వసూళ్లతో విలవిల్లాడుతున్న తల్లిదండ్రులు
అప్పులు చేసి మరీ ఫీజుల చెల్లింపు.. నలిగిపోతున్న మధ్యతరగతి!
పాఠశాలల్లో అడ్మిషన్ నుంచి యూనిఫాం వరకు అన్నీ వ్యాపారమే!
స్పందన లేని మండల విద్యాధికారి తీరుపై అనుమానాలు!
నిబంధనల అమలులో విద్యాశాఖ నిర్లక్ష్యం!
కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యను సేవగా కాకుండా లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చేశాయి. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తూ, వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అడ్మిషన్ రుసుములు, నెలవారీ ఫీజులే కాకుండా పుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు, పాదరక్షలు మరియు రవాణా ఖర్చుల పేరుతో వేలాది రూపాయలు గుంజుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆశతో తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటే, యాజమాన్యాలు దానినే పెట్టుబడిగా మార్చుకున్నాయి. ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పులు చేసి, అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు చదువుతున్న వారైతే, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ పాఠశాలల అరాచకత్వం పెరిగిపోతోంది.
మౌనం వహిస్తున్న మండల విద్యాశాఖ అధికారి
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మండల విద్యాశాఖ అధికారిపై ఉంది. కానీ, ఎన్నడూ తనిఖీలు నిర్వహించకపోవడం, ఫిర్యాదులు అందినప్పటికీ స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యాజమాన్యాల తీరుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, నిబంధనలను ప్రశ్నించకపోవడం వెనుక ఏదో మతలబు ఉందని, దీనిపైనే ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాల పట్ల అధికారుల మౌనం, దోపిడీకి పరోక్షంగా సహకరించడమేనని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి!
విద్య హక్కు అనేది అందరి హక్కు కావాలి కానీ, వ్యాపారం కాకూడదని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల జాబితాను సేకరించాలని వారు కోరుతున్నారు. దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని ఏన్కూర్ మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

