సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
అంజనపురం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలి
క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం టౌన్ : వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనపురం గ్రామంలో గోదైజ్ సంస్థ నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్, పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణం, సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సభా ప్రాంగణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను శాస్త్రీయంగా రూపొందించి, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక మార్గాలు, కూర్చునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బహుస్థాయి భద్రత.. వైద్య సదుపాయాలు
ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ బహుస్థాయి భద్రతా చర్యలు చేపట్టాలని కమిషనర్ సునీల్ దత్‌కు సూచించారు. అలాగే సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలన్నారు. అగ్నిమాపక శాఖ ఫైర్ టెండర్లు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంబులెన్సులు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఈ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు, రైతులకు ఎంతో ప్రోత్సాహకరంగా మారుతుందని, తద్వారా మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని కలెక్టర్ వివరించారు. రైతుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఈ పరిశీలనలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, గోదైజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

