పంచాయతీలో నిధుల దుర్వినియోగం
ఫోర్జరీ సంతకాలు, ప్రభుత్వ ట్రాక్టర్ దుర్వినియోగం
డీపీవోకు తోపనపల్లి జీపీ ప్రజాప్రతినిధుల ఫిర్యాదు
సిబ్బందికి జీతాలు చెల్లించకుండా వేధింపులు
తోపనపల్లిలో సర్పంచ్ భర్త పెత్తనం
: ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆరోపణలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ పంచాయతీలో అక్రమాల పర్వం కొనసాగుతోందని, సర్పంచ్ చాగంటి మమత మరియు ఆమె భర్త తిరుమల్ పంచాయతీ నిధులను, సిబ్బందిని తమ సొంత పనులకు వాడుకుంటున్నారని పాలకవర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఉప సర్పంచ్ నీలకంఠం వెంకన్న ఆధ్వర్యంలో వార్డు సభ్యులు బుధవారం జిల్లా పంచాయతీ అధికారికి (డీపీవో) లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఫోర్జరీ సంతకాలు: మిషన్ భగీరథ ఆపరేటర్ హాజరు రిజిస్టర్‌లో నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ భర్త తిరుమల్ ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో దాదాపు 20 రోజుల పాటు తమ సొంత పనులు చేయించుకుని, అందుకు సంబంధించిన జీతాల నిధులను అక్రమంగా డ్రా చేశారని ఆరోపించారు. సర్పంచ్ చాగంటి మమత తన సొంత పొలం పనులకు ప్రభుత్వ సిబ్బందిని వాడుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ట్రాక్టర్‌ను వ్యక్తిగత నిర్మాణ పనులకు, సిమెంట్ బెడ్లు, ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని, దాతలు ఉచితంగా ఇచ్చిన ఫ్రీజర్‌ను పక్క గ్రామాలకు కిరాయికి ఇచ్చి, ఆ సొమ్మును పంచాయతీ ఖాతాలో జమ చేయడం లేదని వాపోయారు. మల్టీపర్పస్ వర్కర్లకు జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు ఆరు నెలల జీతాలు బకాయి ఉన్నాయని, తీర్మానం చేసినా సర్పంచ్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాట వినడం లేదనే కక్షతో ఇద్దరు సిబ్బందిని కార్యాలయంలోకి రాకుండా తాళాలు వేసి వేధిస్తున్నారని తెలిపారు.
సమగ్ర విచారణ జరపాలి: పాలకవర్గం డిమాండ్
సర్పంచ్ చాగంటి మమత, ఆమె భర్త తిరుమల్ చేసిన అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాలకవర్గం డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని వారు డీపీవోను కోరారు.

