మంత్రుల పర్యటన బోసిగా..మణుగూరులో సందడే కరువు…
ఉప ముఖ్యమంత్రి వచ్చినా కనీసం తోరణాలు కూడా కట్టని అధికార పార్టీ…
ఇదే బీఆర్ఎస్,బీజేపీ పార్టీ వాళ్ళైతే వేరే లెవెల్ ఉండేదని ప్రజల విమర్శలు…
మంత్రులు వచ్చినట్టే లేదంటున్న మండల ప్రజలు…
కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి: మణుగూరు మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించినా ఆ ప్రభావం స్థానికంగా ఎక్కడా కనిపించలేదని తెలుస్తుంది. అత్యున్నత స్థాయి నేతలు వస్తున్నా మణుగూరు మండలంలో కనీస సందడి కూడా లేకపోవడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.ఊరంతా బోసిగా ఉండడం,ఎక్కడా తోరణాలు, స్వాగత తోరణాలు,బ్యానర్లు లేకపోవడంతో “ఉప ముఖ్యమంత్రి వస్తున్నా ఇంత నిర్లక్ష్యమా” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అధికార పార్టీ నాయకులు,కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించక పోవడం,ఏర్పాట్లలో అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది.మొత్తం మండలంలో అక్కడక్కడ కేవలం 10 నుంచి 15 ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం.రాష్ట్రానికి రెండో అతిపెద్ద నేత,ఇద్దరు కీలక మంత్రులు వస్తుంటే ఇంత చిన్నచూపా..? వారికి కనీస విలువ కూడా లేదా..? అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. మంత్రులు వచ్చినట్లు గ్రామాల్లో ఎలాంటి హడావుడి,ప్రచారం లేకపోవడంతో సామాన్య ప్రజలకు కూడా పర్యటన విషయం ఆలస్యంగా తెలిసిందని చర్చించుకుంటున్నారు.
ఇదే బీఆర్ఎస్,బీజేపీ అయితే ఆ వాతావరణం వేరేలా ఉండేది…
గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి మంత్రుల పర్యటనలు పండగలా జరిగేవని ప్రజలు పోల్చి చెబుతున్నారు.అప్పుడు ఊరంతా తోరణాలతో, బ్యానర్లతో,డప్పులతో సందడిగా ఉండేదని కబుర్లు చేస్తున్నారు.నాయకులు,కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికేవారని అంటున్నారు.ఇప్పుడు అధికార పార్టీకి ఆ స్థాయి కూడా లేదా..?” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికార పార్టీ నాయకత్వంలో సమన్వయ లోపం,స్థానిక ఎమ్మెల్యే ఉదాసీనత వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సప్పగా ముగిసిన పర్యటన..విమర్శల వెల్లువ…
మొత్తంగా ముగ్గురు మంత్రుల పర్యటన సప్పగా, నామమాత్రంగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు లేకపోవడం,స్థానిక సమస్యలపై చర్చ లేకపోవడంతో ఈ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని చర్చ స్థానికుల్లో మొదలైంది.పై నుంచి వచ్చే పెద్దలకు గౌరవం ఇవ్వలేని పార్టీ,కింద ఉన్న ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తుందని ఇప్పుడు మణుగూరు ప్రజల ప్రధాన ప్రశ్నగా మారింది. అధికార పార్టీ తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.మొత్తంగా మంత్రులు వచ్చినట్టే లేదని మంత్రుల పర్యటన ప్రజల్లో ఎలాంటి ఆసక్తిని కలిగించలేకపోయిందని తెలుస్తోంది.

