మిడ్ మానేరు నుంచి సాగునీరు విడుదల చేయాలి
పోత్తూరు బ్రిడ్జిపై రైతుల భారీ మహాధర్నా
కాకతీయ, ఇల్లంతకుంట: మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్‌లో పంపులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు బ్రిడ్జిపై గురువారం రైతులు మహాధర్నా నిర్వహించారు. జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నీటి విడుదలలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్‌లో పంపులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని ప్రారంభించకపోవడం, మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు వాపోయారు. ఇప్పటికే వరి పంటలకు నీటి అవసరం అత్యవసరంగా ఉందని, మరికొంత ఆలస్యమైతే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిడ్ మానేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయడంతో పాటు పంప్ హౌస్‌లను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. నీటి విడుదల జరిగే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.

