మత్తుకు బానిసవుతున్న యువత
మండల కేంద్రంలో జోరుగా అంబర్, గుట్కా, సిగరెట్ విక్రయాలు
బెల్ట్ షాపులపై మౌనవ్రతం పాటిస్తున్న శాఖల అధికారులు
కాకతీయ, ఆత్మకూరు: తెలంగాణ ప్రభుత్వం సే నో డ్రగ్స్ పేరుతో మాదక ద్రవ్యాల నియంత్రణకు పెద్దపీట వేస్తుంటే, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో యువత, మైనర్ విద్యార్థులు సైతం అంబర్, గుట్కా, సిగరెట్, మద్యం వంటి మత్తు పదార్థాలకు విచ్చలవిడిగా బానిసలవుతున్నారు. ఈ విషయంపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఉన్న పోలీస్ అధికారులు పాఠశాలలు, కళాశాలల సమీపంలో పాన్ షాపులు, మద్యం దుకాణాలు ఉండకూడదని ఆదేశించినప్పటికీ, ప్రస్తుతం ఆ నిబంధనలు గాలికి వదిలేయడం గమనార్హం.
బెల్ట్ షాపుల దందాపై మౌనం వీడాలి
మండలంలో మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూతపడాల్సి ఉన్నప్పటికీ, బెల్ట్ షాపుల్లో మాత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి 163 పై ఉన్న బెల్ట్ షాపుల విషయంలో పోలీసులు మౌనవ్రతం పాటించడం వెనుక ఆంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో మద్యం అమ్మకాల వల్ల గూడెప్పాడ్ జంక్షన్ సమీపంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, యువత గొడవలకు దిగి గాయాలపాలవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలు, కళాశాలల ఆవరణాల్లోని అక్రమ విక్రయాలను, బెల్ట్ షాపులను కట్టడి చేయాలని, యువతను వ్యసనాల బారి నుంచి కాపాడాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

