ఎల్గూర్ రంగంపేటలో రెండు నెలలుగా చిమ్మచీకట్లు
వీధి దీపాలు వెలగక ప్రజల అవస్థలు
ప్రమాదాల భయంతో గ్రామస్తుల ఆందోళన
కాకతీయ, సంగెం : మండలంలోని ఎల్గూర్ రంగంపేట గ్రామం రెండు నెలలుగా చీకటిలో మగ్గుతోంది. గ్రామంలోని సగానికి పైగా వీధి దీపాలు వెలగక పోవడంతో ప్రజలు రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు పూర్తిగా చీకటిమయంగా మారడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ప్రాణ భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. వీధి దీపాలు లేకపోవడంతో పాములు, వీధి కుక్కల సంచారం, కోతుల ఆగడాలు పెరిగాయి. రాత్రి వేళల్లో దొంగతనాల భయం కూడా గ్రామస్తులను వెంటాడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందాలన్నా, పిల్లలను బయటకు పంపాలన్నా ప్రజలు భయపడుతున్నారు. ఈ సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల్లో స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
ప్రజల భద్రతకు సంబంధించిన అంశంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే మరమ్మతులు చేసి వెలుగులు నింపాలని వారు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లేనిపక్షంలో గ్రామ ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

